ARTICLE AD BOX
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి
| Published: Friday, February 19, 2021, 14:21 [IST]
చెన్నై: కొద్ది రోజుల పాటు క్రికెట్ ప్రేమికులను ఊరిస్తూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్-14 సీజన్ వేలంపాట ముగిసింది. ఊహించినదాని కంటే ఈ సారి అధిక మొత్తానికి క్రికెటర్లను కొనుగోలు చేశాయి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు. ఇదివరకెప్పుడూ లేని రేటు ఈ సారి పలికింది. ఏకంగా నలుగురు క్రికెటర్లు 14 కోట్లు, అంతకుమించి రేటుకు అమ్ముడుపోయారు. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ క్రిస్ మోరిస్‌ను పంజాబ్ కింగ్స్ జట్టు ఏకంగా 16 కోట్ల 25 లక్షల రూపాయలతో సొంతం చేసుకుంది. ఆ తరువాతి స్థానంలో కివీస్ పేసర్ జెమిసన్ నిలిచారు. 15 కోట్ల రూపాయలతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతన్ని జట్టులోకి తీసుకుంది. కొందరు అనామక క్రికెటర్లపైనా కనకవర్షం కురిసింది.

ఫ్రాంఛైజీలకు ఆదాయం ఎలా?
మరి.. ఇన్ని వందల కోట్ల రూపాయలను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు పెడుతోన్న ఐపీఎల్ ఫ్రాంచైజీలకు దానికి తగ్గట్టుగా ఆదాయ వస్తుందా? ఎలా వస్తుంది? ఏ రూపంలో ఫ్రాంఛైజీలు తాము ఖర్చు చేసిన సొమ్మును రాబట్టుకుంటాయనేది ఆసక్తి కలిగించే విషయమే. నిజానికి ఐపీఎల్ ఫ్రాంఛైజీ జట్టును కొనుగోలు చేసే ఏ మేనేజ్మెంట్ కూడా నష్టపోదు. పైగా పదింతల ఆదాయాన్ని ఆర్జిస్తుంది. దీనికి ప్రధాన కారణం.. క్రికెట్ ప్రేమికుల అభిమానమే పెట్టుబడి.

స్పానర్సర్ల ద్వారా..
ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు వేర్వేరు మార్గాల ద్వారా వందల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది. ఇందులో ప్రధాన ప్రాత పోషించేది స్పానర్లే. మ్యాచ్ ఆడే సమయంలో క్రికెటర్లు ధరించే జెర్సీలు, ట్రైనింగ్ కిట్ల మీద మల్టీనేషనల్ కంపెనీల పేర్లు, వారి బ్రాండ్లను ముద్రించడం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆర్జిస్తాయి ఫ్రాంఛైజీలు. ప్రత్యేకించి- జెర్సీల ఛెస్ట్ భాగంలో ముద్రించే బ్రాండ్ల ద్వారా వచ్చే రాబడి ఎక్కువ. జెర్సీ ఛెస్ట్ భాగంలో తమ కంపెనీల పేర్లు, బ్రాండ్లను ముద్రించడానికి కంపెనీలు పోటీ పడుతుంటాయి. అలాగే గ్రౌండ్లో బౌండరీ లైన్ల దగ్గర అమర్చే బోర్డుల ద్వారా ఆదాయం వస్తుంది.

మీడియా హక్కుల ద్వారా..
మీడియా హక్కుల ద్వారా లభించే ఆదాయం కూడా భారీగా ఉంటుంది. దీన్ని ఫిక్స్డ్ ఇన్కమ్గా విశ్లేషిస్తుంటారు. మీడియా హక్కుల ద్వారా వచ్చే ఆదాయానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పెద్దన్న పాత్ర పోషిస్తుంటుంది. ఈ రూపంలో అందే రాబడిని సమానంగా పంచి.. అన్ని ఫ్రాంఛైజీలకు పంపించే బాధ్యత బీసీసీఐదే. ఇందులో బీసీసీఐకి కొంత వాటా వెళ్తుంది. టీమ్ సభ్యులు హాజరయ్యే కార్యక్రమాల ద్వారా వచ్చే ఆదాయం కూడా ఫ్రాంఛైజీలకే వెళ్తుంది. అడ్వర్టయిజ్మెంట్లకు ఇందులో నుంచి మినహాయింపు ఉంది.

టికెట్ల విక్రయాల రూపంలో..
టికెట్ల విక్రయాల రూపంలో వచ్చే ఆదాయం శాతం ఎక్కువే. స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్‌లను తిలకించడానికి విక్రయించే టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం నేరుగా ఫ్రాంఛైజీ యాజమాన్యాల పాకెట్లలోకే వెళ్తుంది. ఇందులో బీసీసీఐకి గానీ, క్రికెటర్లకు గానీ దక్కే ఆదాయం నామమాత్రంగా ఉంటుందంతే. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వంటి టైటిల్స్ కింద క్రికెటర్లకు లభించే ప్రైజ్ మనీ కూడా ఆయా స్పాన్సర్లే ఖర్చు పెట్టాల్సి ఉంటున్నందున.. ఫ్రాంఛైజీలు పెద్దగా నష్టపోయేదేమీ ఉండదు.

ప్రైజ్ మనీ కూడా..
ఐపీఎల్ టైటిల్ గెలిచిన తరువాత విజేతకు ప్రైజ్‌మనీ రూపంలో అందించే మొత్తం కూడా ఫ్రాంఛైజీలకే చెందుతుంది. దానితోపాటు మర్చంటైజ్డ్ సేల్స్.. అంటే తమ టీమ్ లోగోను ముద్రించిన టోపీలు, టీ షర్టులు వంటి విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయం ఫ్రాంఛైజీలకు వెళ్తుంది. స్టేడియాల ఆవరణలో స్టాళ్లను నెలకొల్పడానికి అద్దె ప్రాతిపదికన స్థలాన్ని కేటాయిస్తుంటారు. అద్దె రూపంలో వచ్చే రాబడి సైతం ఫ్రాంఛైజీలకే దక్కుతుంది. స్టేడియం నిర్వహణ కోసం అవసరమైన మొత్తాన్ని బీసీసీఐ.. ఆయా క్రికెట్ అసోసియేషన్లకు చెల్లిస్తుంది. దీనికోసం బీసీసీఐ కొంత మొత్తాన్ని ఫ్రాంఛైజీల నుంచి వసూలు చేస్తుంటుంది.
English summary
Every year, before the start of the league, the franchise owners pay a huge sum at the auctions to buy the services of players. But have you ever wondered how these franchises earn money through IPL? What is the revenue model of these IPL franchises?
Story first published: Friday, February 19, 2021, 14:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x